శ్రీ కల్లూరి చంద్రమౌళిస్వాతంత్ర సమరయోధుడు, మొదటి తరం రాజకీయ నాయకుడు . కల్లూరి చంద్రమౌళి 1898 నవంబరు 15న గుంటూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. చంద్రమౌళి 1920లో ఇంగ్లాండు వెళ్ళి స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొంది భారతదేశానికి తిరిగివచ్చి స్వ రాష్ట్రంలో వ్యవసాయభివృద్ధికై కృషిచేశారు.
జాతీయ భావాలు కలిగిన చంద్రమౌళి కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనారు. బాల్యం నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే మక్కువ, దేశ భక్తి కలిగిన చంద్రమౌళి 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయోద్యమాలలో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.
చంద్రమౌళి 1937, 1946లో ఉమ్మడి మదరాసు రాష్ట్రం 1955 , 1962లలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై నారు. మద్రాసు ప్రావిన్సులో రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజ మంత్రి వర్గంలోనూ ,మద్రాసు నుండి విడిపోయిన తరువాత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం లో బెజవాడ గోపాలా రెడ్డి మంత్రి వర్గం లోను, ఆతరువాత సంజీవయ్య మంత్రి వర్గం లో మంత్రిగా పనిచేశారు. దేవాలయాల అభివృద్ధికి వీరు విశేషకృషి చేశారు, శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు. వీరు కొంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1962లో వేమూరు నుండి శాసనసభ కు ఎన్నికయిన చంద్రమౌళి 1965లో తన శాసనసభ్యత్వానికి, తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలికీ, భద్రాచల రామాలయ జీర్ణోద్ధారణ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
చంద్రమౌళి గారి సేవలలో ముఖ్యమైనది భద్రాచలం గుడి పునర్నిర్మాణం. 1960 నాటికి గుడి బాగా శిధిలమైంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. వెంటనే గుడి పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు సేకరించగలిగారు. నాడు భద్రాచలం మారుమూల అటవీప్రాతం. యాత్రీకులకు దేవస్థానంలో ఏ సౌకర్యాలు లేవు. ముందుగా తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించి కల్యాణమండపం నిర్మించ తలపెట్టారు. సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్ళలో తెచ్చి అక్కడినుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలో కెక్కించి అతికష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణమండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలవారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపములోని తాటియాకుల గూడెంలో సేకరించారు.
మహామండపాన్ని అష్ఠలక్ష్ములు, దశావతారాలు, ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటుచేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది. 1974లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చంద్రమౌళిని రామాలయ ధర్మకర్తల సంఘానికి అధ్యక్షులుగా నియమించారు. వెంటనే విశేషంగా విరాళాలు సేకరించి చిత్రకూట మంటపాన్ని 127 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించారు. స్థంభాలపై అద్భుతమైన శిల్పలు చెక్కించారు.
ఈ విధంగా భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు. తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. స్వయంగా రామాయణ సుధాలహరి, రామకథానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ మున్నగు పుస్తకాలు రచించారు. 1992 జనవరి 21న చంద్రమౌళి తన స్వ గ్రామం మోపర్రులో పరమపదించారు